• సుమలతా దేవి వర్గానిదే చట్టబద్ధమైన హక్కు: TFTDDA
  • తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ నిధులకు రక్షణ..
  • సెప్టెంబర్‌ 13 జనరల్‌ బాడీ సమావేశంపై మధ్యంతర ఇంజంక్షన్

హైదరాబాద్‌: తెలుగు ఫిల్మ్‌ అండ్‌ టీవీ డ్యాన్సర్స్‌ అండ్‌ డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA)లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. సంఘం పేరుతో సెప్టెంబర్‌ 13న ఇందిరానగర్‌లోని హోటల్‌ అనుపమలో కొందరు నిర్వహించ తలపెట్టిన జనరల్‌ బాడీ సమావేశాన్ని నిలిపివేస్తూ కూకట్‌పల్లి రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసినట్లు అసోసియేషన్‌ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి వర్గం వెల్లడించింది.

సమావేశాల నిర్వహణ, లేఖలపై ఆంక్షలు
ప్రతివాదులైన కే. రాఘవేంద్ర, వై. మెహర్‌ బాబుతో పాటు ఇతరులు అసోసియేషన్‌ పేరుతో ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా సంఘానికి చెందిన అధికారిక లెటర్‌హెడ్‌లు, సీళ్లు, మినిట్స్‌ బుక్‌, అధికారిక సంతకాలను వినియోగించడంపై ఆంక్షలు విధించింది. బ్యాంకులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సంఘం తరఫున లేఖలు రాయకూడదని ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులు, కోర్టులో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం న్యాయస్థానం ఈ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిందని, తదుపరి విచారణను అక్టోబర్‌ 12కు వాయిదా వేసిందని ప్రతినిధులు తెలిపారు.

2025–27 కార్యవర్గమే చెల్లుబాటు అవుతుంది
కోర్టు ఉత్తర్వుల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్‌ ఇజ్రాయెల్‌ మాట్లాడారు. 2025–2027 కాలానికి బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ కార్యవర్గానికే అసోసియేషన్‌ పాలన, అధికారిక కార్యకలాపాలు నిర్వహించే చట్టబద్ధమైన హక్కు ఉందని తేల్చిచెప్పారు. రఘు మాస్టర్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిబంధనల ప్రకారం సుమలతా దేవి విజయం మాత్రమే చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు.

రూ.4 కోట్ల నిధులు ఫ్రీజ్.. కుట్రలపై ఫైర్
గత ఆగస్టు 30న ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కొందరు చట్టవిరుద్ధంగా సమావేశం నిర్వహించి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించుకున్నారని సుమలతా దేవి ఆరోపించారు. యూనియన్‌ అధికారిక ఈమెయిల్‌ ఐడీని హ్యాక్‌ చేసి, జూబ్లీహిల్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు నకిలీ లేఖలు పంపి ఖాతా సంతకాలను మార్చేందుకు యత్నించారని తెలిపారు. సభ్యుల సంక్షేమానికి సంబంధించిన దాదాపు రూ.4 కోట్ల నిధులను కాపాడేందుకే కోర్టును ఆశ్రయించామని, ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఇకపై అధ్యక్షుడు, జనరల్‌ సెక్రటరీ, ట్రెజరర్ల ఉమ్మడి సంతకాలతోనే ఆర్థిక లావాదేవీలు நடస్తామన్నారు.

లేబర్‌ ఆఫీస్‌ (JCL) మార్గదర్శకాలకు అనుగుణంగానే నూతన సభ్యత్వాల నమోదు కొనసాగుతుందని వివరించారు. ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు వ్యక్తులు, ప్యానెల్‌ ఇన్‌చార్జీల నిబంధనలను కఠినతరం చేయడాన్ని తట్టుకోలేక ఈ వివాదానికి తెరలేపారని జనరల్‌ సెక్రటరీ మండిపడ్డారు. కేవలం కాగితాలపై సంతకాలు చేసి నలుగురు కలిసి కమిటీగా ఏర్పడితే అది కోర్టుల దృష్టిలోనూ, యూనియన్‌ నిబంధనలలోనూ చెల్లదని పేర్కొన్నారు.

ఫెడరేషన్‌తో చర్చలు.. త్వరలోనే పరిష్కారం
నకిలీ లెటర్‌హెడ్‌లతో అయోమయం సృష్టించిన వారికి కోర్టు ఉత్తర్వులే సరైన సమాధానమని ట్రెజరర్‌ ఇజ్రాయెల్‌ అన్నారు. ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని, పెద్దల సమక్షంలో నాలుగైదు రోజుల్లో అధికారికంగా జనరల్‌ బాడీ సమావేశాన్ని నిర్వహించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా యూనియన్‌ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని నృత్య కళాకారులు, డ్యాన్స్‌ డైరెక్టర్లకు విజ్ఞప్తి చేశారు.

By Live24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *