- నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల స్థానం నుంచే పోటీ
- పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయం
- ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ సుదీర్ఘ కార్యాచరణ ప్రకటన
హైదరాబాద్ (మీడియాబాస్ నెట్వర్క్): పట్టభద్రులు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారమే పరమావధిగా నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు అటవీ శాఖ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) యర్కల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రజాక్షేత్రంలో ఉండి పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకే తన ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన రాబోయే కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ – నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సమగ్ర ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు నోటిఫికేషన్ల నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతి ప్రక్రియను పారదర్శకంగా, నిర్ణీత వ్యవధిలోనే పూర్తయ్యేలా సమర్థవంతంగా కృషి చేస్తానని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో అధునాతన గ్రంథాలయాలు, అధ్యయన కేంద్రాలు, ఉచిత డిజిటల్ వనరులను అందుబాటులోకి తెస్తామన్నారు. డిగ్రీ పూర్తయిన యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ నైపుణ్యాలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రైవేటు రంగంలోనూ స్థానిక పట్టభద్రులకు ప్రాధాన్యత దక్కేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి అండగా…
ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సీపీఎస్ రద్దు, ప్రమోషన్లు, బదిలీలు మరియు పెండింగ్ బకాయిల సాధన కోసం సభలో మరియు వెలుపల గళమెత్తుతానని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు వారి ఉద్యోగ భద్రతకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.
విద్య, మహిళా సాధికారతకు ప్రాధాన్యత
ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక వసతులు, ల్యాబ్లు, లైబ్రరీల అభివృద్ధితో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో అందేలా ఒత్తిడి తెస్తామని తెలిపారు. గ్రామీణ విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సమాన అవకాశాలు దక్కేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా పట్టభద్రుల భద్రత, స్వయం ఉపాధి, బ్రేక్ తర్వాత తిరిగి కెరీర్ ప్రారంభించేలా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో గ్రామీణ యువతకు ఉపాధి ప్రోత్సాహకాలు అందిస్తామని స్పష్టం చేశారు.
అందుబాటులో ఉండే నాయకత్వం
పట్టభద్రులు తమ సమస్యలను ఎప్పటికప్పుడు నేరుగా ప్రజాప్రతినిధి దృష్టికి తెచ్చేలా ప్రత్యేక సంప్రదింపుల వేదికను ఏర్పాటు చేస్తానని చెప్పారు. నిరుద్యోగులు, ఉద్యోగుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధమైన తనకు, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ మద్దతుగా నిలిచి గెలిపించాలని యర్కల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
